Pages

Thursday, August 30, 2012

అర్ధాంతపు ఆర్తాత్రం..

అవి నేను వైజాగ్ లో జిగ్ జాగ్ గా చదువుకుంటూ ఆదివారం జిల్ జిల్ జిగా అనుకుంటూ సాయంత్రం బీచ్ తర్వాత సినిమా చూసొచ్చి హాస్టల్ కి రిటర్న్ అవుతున్న రోజులు...

అప్పుడే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కి మేము కూడా
చిత్రాలయ థియేటర్ లో అడుగుపెట్టాక

వారానికోసారి వీక్లీ
టెస్ట్ రాసినా రాయకపోయినా ఈ సినిమాకి మాత్రం తప్పని సరిగా వెళ్ళేవాళ్ళం నేనూ మా ఫ్రెండ్ ప్రతీక్..
అంతగా నచ్చడానికి ఏముంది ఈ సినిమా లో
                
                        

వెంకటేష్ పెర్ఫార్మన్స్
త్రివిక్రమ్ డైలాగులు,పంచులు,టవల్స్,బ్లేంకెట్స్ మరెన్నో   
విజయ భాస్కర్ దర్సకత్వం
సునీల్ బ్రహ్మానందం కామిడీ
ఎయ్య్ ఇవి ఎవర్ గ్రీన్ అలానే ఉంటాయి 
అదే హీరోయిన్ మా బీ.ఏ తో కానీ ఒకసినిమా కానీ చేసిందంటే మా టీవీ లా మామిడికాయ లా ఉన్న అమ్మాయి కాస్త గుమ్మడికాయ లా తయారవుతుంది.


ఆలోచించని ఆశాభంగం ఆశాషైనీ అని ఆ సినిమా ని లెక్కలేనన్ని సార్లు చూసే లోపు  

ఆర్తీ అగర్వాల్ రెండో సినిమా
నువ్వు లేక నేను లేను రిలీజ్ అయ్యింది.

అబ్బో అబ్బో అబ్బో సినిమా కేక హీరోయిన్ వల్లనే హిట్ అయింది అని మా ఫ్రెండ్స్ శనివారం రాత్రి దొంగ మొహాలు వెళ్ళి చూసేసి వచ్చింది కాకుండా  పడుకున్న మా చెవుల్లో జంబో సైజ్ జోరీగల్లా అరుస్తూనే ఉన్నారు
నేను ప్రతీక్ గాడు ఇద్దరం డిసైడ్ అయిపోయాం

విజయమో ఆర్తీ ని 70MM లో చూడడమో అని ఆ  రోజు టెస్ట్ తొందరగా  మేము ఆదివారం మద్యాహ్నం థియేటర్ దగ్గరకు వెళ్ళాం..

ఏమిటిది మంతెన సోదరులు విశాఖ పట్నం ఎప్పుడు వచ్చారు ఇంత జనం ఉన్నారు ఈ ప్రదేశం లో అని నేనొకరిని అడిగాను
వాడు నావైపు ఒక విచిత్రమయిన మోహన్ బాబు కూతురి ఎక్స్ప్రెషన్ పెట్టి ఫస్ట్ షో టికెట్స్ అయిపోయి చాలా సేపు అయింది 
వీళ్ళంతా సెకండ్ షో కి లైన్ కట్టిన ప్రజలు అని ఆర్తి కబురు ఆర్టిస్టిక్ గా చెప్పాడు

నేనూ,ప్రతీక్ వెళ్ళిపోదామని అనుకొని
మరొక్కసారి ట్రై చేయు బ్లాక్ లో అని వాడికి డబ్బులిచ్చి లోపలి పంపించి నేను థియేటర్ బయట చేసేది లేక చేయగలిగినా చేయలేక అగర్వాలీ లాలీ అనుకుంటూ అలా పోస్టర్లు చూస్తూ కూర్చున్నా

వాడో నలబై అయిదు నిమిషాలు తర్వాత వాడు బయటకు వచ్చాడు

నేను:కాయా,పండా
ప్రతీక్:కాటు
నేను:అంటే ?
ప్రతీక్:నా జేబు కత్తిరించేసారు హరే..నాకున్నవి రెండే పేంట్లు అని బాలకృష్ణ స్థాయి లో ఏడుపు మొదలెట్టాడు.
నేను:వార్నీ రెండు కాకపొతే మూడు ఉంటాయా.. నెల రోజుల్లో నాలుగు సార్లు నువ్వు ఆర్తీ అగర్వాల్ కోసం పెట్టిన ఖర్చు కి ఒక మంచి డ్రెస్ వస్తుంది

పోయిన జేబు ఒక టైలర్ దయవల్ల రాక మానదు,నువ్వు నా దగ్గర తీసుకున్న పైసలు నేను రాబందులా రాబట్టక మానను ఇదే సృష్టి ధర్మం అని చెప్పేసి థియేటర్లో అతికించిన పోస్టర్స్ అన్నీ ఇద్దరం చూసుకుంటూ వచ్చేవారం వస్తున్నాం వస్తున్నాం గెట్ రడీ మేకప్ తక్కువ వేసుకో ఇంకా
ఆ  తరుణ్ తంబూర్ గాడితో ఎక్కువ తిరగకు హమారా ఆర్తీ అనుకొంటూ ఒక చోట ఇద్దరం ఆగాము

గోడ మీద ఒక పోస్టర్ ఆ  పక్కనే ఇంకో పోస్టర్ కేవలం ఆర్తి అగర్వాల్ మరియు టైటిల్ మాత్రమే ఉన్నాయి రెండు పోస్టర్స్ లో..దానర్ధం పోస్టర్ ఒకటే గోడ వేరు అని
అబ్బా! పోస్టర్ అంటే ఇది..హీరోయిన్ అంటే కూడా ఇదే అని చాలా శ్రద్ధగా ఆ  పోస్టర్స్  ని పీకేసి రోల్ లా చుట్టేసి ఎలాగైతేనేం హాస్టల్ కి తీసుకోచ్చేసాం

                               
    

దుప్పటి లేక దిండు లేదు అన్నట్టు ఆర్తీ పోస్టర్ లేక నిద్ర లేదు లా
మేము ఆర్తీ పోస్టర్ రోల్
దిండు కింద వేసుకొని నిద్రపోయేవాళ్ళం
ఈ లోపు మా వార్డెన్ కి ఏ పోయేకాలం వచ్చిందో మరి వాడి రౌండ్స్ ఎక్కువయ్యాయి
వాడి రౌండ్స్ కి బుల్లెట్ దెబ్బలు మా హృదయాన్ని,మా ప్రిన్సిపాల్ దెబ్బలు చెంప ని ఒకే క్షణం లో తాకాయి

ప్రిన్సిపాల్:పరీక్షల కి గడువు మూడు నెలలు కూడా లేవు మీరేంటి ఈ తిరుగుళ్ళు ఈ వింత చేష్టలు అని ఒక రేంజ్ లో తిట్టేసాడు

వార్డెన్ ఆ  రెండు పోస్టర్లు మా ముందే నలిపేసి మా గుండెలను ముక్కలు ముక్కలు చేసి వీటిని డస్ట్ బిన్ లో పారేస్తున్నా అని బయటకు వెళ్తున్న వార్డెన్ ని మా ప్రిన్సిపాల్  కేకేసాడు 
ప్రిన్సిపాల్:నా  రూమ్ లో ఉన్న డస్ట్ బిన్ లో పడేయ్
వార్డెన్:బెడ్ షీట్ సైజ్ పోస్టర్స్ డస్ట్ బిన్ లో పట్టేంత ప్లేస్,వీటిని రోజంతా మీరు చూసే వయసు మీకు లేవు అని చెప్పేసి వార్డెన్ బయటకు నడిచాడు

మాకొక మరో చిన్న క్లాస్ ప్రిన్సిపాల్ తీసుకున్నాక మేము అవమాన భారం తో రూమ్ లోనికి వచ్చి ఏం చేయాలో అర్ధం కాక

ఆ  మూడు నెలలు శ్రద్ధ గా చదువుకొని పరీక్షలు రాసేసాం
ఆ  తర్వాత కౌన్సలింగ్ అయ్యాక చెంగు చెంగు అంటూ ఇద్దరం విజయవాడ లో వేరు వేరు కాలేజీల్లో చేరిపోయాం

వీకెండ్ వచ్చింది
హాస్టల్ లో ఈ రాగింగ్ అరాచకాలను భరించలేక సీనియర్స్ కి ఎవరికీ కనిపించకుండా పెందలాడే వాడి రూమ్ కి వెళ్ళాను
వాడు బ్రష్ చేయడానికి వాష్ రూమ్ కి వెళ్ళాడు

నేను బెడ్ మీద కూర్చున్నా,
అదేదో విక్రమార్క సింహాసనం మీద కూర్చున్నట్టు నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయ్
ఫిట్స్ ఏమో అని నా రూమ్ కీస్ చేతులో పెట్టుకున్నా వణుకు ఇంకా తగ్గలేదు

బెడ్ మీద నుండి లేచాను..లేచాక నార్మల్ గానే ఉన్నాను
రూమంతా చూసాను కంప్యూటర్ కాదు కదా కీ బోర్డు కూడా లేదు బెడ్ మీద
దొంగ మొహం గాడు బెడ్ లో కరెంట్ షాక్ కొట్టడానికి ఏమైనా వైర్ తగిలించాడా అని బెడ్ ని కిందా పైనా బయటా లోపలా సుదీర్ఘంగా పరిశీలించాకమా ప్రతీక్ దుప్పటి కింద
బెడ్ షీట్ వాడి బొంతకి ప్రొటెక్షన్ గా కుట్టేసి ఉంది
ఆ  కుట్లు కొరికేసి చూస్తే
నాకు తెలిసిన నిజం ఏంటంటే
ఆ  బెడ్ షీట్ లో వార్డెన్ బొంత
బొంత కి బెడ్ షీట్ కి మధ్యలో sandwitch అయిన రెండు ఆర్తి అగర్వాల్ పోస్టర్స్.
బ్రతుకు జీవుడా ఆర్తి దాహుడా అని హుడా పార్క్ కి వెళ్ళిపోయాను!